: తమిళనాడులో ఎల్టీటీఈ ప్రభాకరన్ సహాయకుడు అరెస్ట్
ఒకప్పుడు శ్రీలంక ప్రభుత్వానికి సమాంతరంగా ఉత్తర శ్రీలంకలో పరిపాలన సాగించిన ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ కు సహాయకుడిగా ఉన్న కృష్ణకుమార్ ను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత రాత్రి రామనాథపురం జిల్లా ఉచ్చిపుల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వాహనాన్ని ఆపిన పోలీసులు, అందులో ఉన్న శశికుమార్, కృష్ణకుమార్, రాజేంద్రన్ లను ప్రశ్నించగా, ముగ్గురూ పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో అనుమానం వచ్చి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఓ సంచిలో 75 సైనేడ్ గుళికలు, 300 గ్రాముల పౌడర్, 4 జీపీఎస్ పరికరాలు, 8 సెల్ ఫోన్లు, రూ. 42 వేల నగదు పట్టుబడ్డాయి. ఆ తర్వాత వారిని పోలీసులు మరింత విచారించగా... వారిలో ఒకరు శ్రీలంక ప్రభుత్వం గాలిస్తున్న ప్రభాకరన్ సహాయకుడు కృష్ణకుమారే అని తేలింది. ప్రభాకరన్ మృతి తర్వాత ఎల్టీటీఈ అంతరించిపోయిందనుకుంటున్న తరుణంలో, సైనేడ్ గుళికలతో కృష్ణకుమార్ పట్టుబడటం తమిళనాట సంచలనంగా మారింది.