: రాజ్ భవన్ వద్ద టీడీపీ నేతల ధర్నా, అరెస్టు
తలసాని శ్రీనివాస్ యాదవ్ బర్తరఫ్ కోరుతూ తెలంగాణ టీడీపీ నేతలు రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు. నిబంధనలు ఉల్లంఘించి తలసానిని మంత్రిని చేశారని, తక్షణం ఆయనను బర్తరఫ్ చేయాలని టీడీపీ నేతలు గవర్నర్ ను కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా తలసాని మంత్రి పదవి నిర్వహిస్తున్నారంటూ విమర్శించారు. గత డిసెంబర్ 16న స్పీకర్ కు రాజీనామా లేఖ పంపానని తలసాని అందర్నీ మోసం చేశారని వారు ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులను చేయాలని డిమాండ్ చేస్తూ, రాజ్ భవన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.