: టీడీపీ నేతలకు తలసాని సవాల్


టీడీపీ నేతలకు సత్తా ఉంటే రోజుకోసారి గవర్నర్, రాష్ట్రపతి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఆగకుండా, టీడీపీలో చేరిన ఇతర పార్టీలకు చెందిన నేతలపై కూడా ఫిర్యాదు చేయాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాలు విసిరారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నేతల్లా అవాకులు చవాకులు మాట్లాడేందుకు తానేమీ బాధ్యత లేని వ్యక్తిని కాదని, తనపై చాలా బాధ్యతలున్నాయని అన్నారు. తన గురించి మాట్లాడే ముందు టీడీపీ నేతల క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవాలని ఆయన సూచించారు. సండ్ర చరిత్రను బయటపెడితే తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదని ఆయన అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కో-ఆపరేటివ్ సొసైటీ పేరిట భూకబ్జాలకు పాల్పడిన సండ్ర తనను విమర్శించడం వింతగా ఉందని ఆయన చెప్పారు. డబ్బులిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన దొంగ తనపై ఆరోపణలు చేస్తున్నాడని ఆయన విమర్శించారు. ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత ఏ పార్టీ కార్డుతో గెలిచారు? ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని ఆయన టీడీపీ నేతలను నిలదీశారు. రుద్రరాజు పద్మరాజు, జూపూడి ప్రభాకర్ ల సంగతేంటని ఆయన నిలదీశారు. కంతేటి సత్యనారాయణ ఏ పార్టీకి చెంది, ఏ పార్టీలో ఉన్నారని ఆయన అడిగారు. తనకు నీతులు చెప్పవద్దని, అంతా చట్టప్రకారం, నిబంధనలకు లోబడే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News