: భాగస్వామ్యమైన ప్రతి ప్రభుత్వ ప్రాజెక్టులోనూ చేతులు కాలాయి: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
ప్రభుత్వ ప్రాజెక్టుల్లో భాగం పంచుకున్న ప్రతిసారీ ఇన్ఫోసిస్ నష్టపోయిందని సంస్థ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులు ప్రారంభమైన తరువాత మార్పులు చేర్పులు జరగడం, చెల్లింపుల ఆలస్యం తదితరాలు సర్వసాధారణమై పోయాయని, అంతర్జాతీయ స్థాయి నిబంధనల అమలు జరగడం లేదని అన్నారు. ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన డిజిటల్ ఇండియా విజయవంతం కావాలంటే, పరిస్థితి మారాలని అన్నారు. "ప్రభుత్వ ప్రాజెక్టులు చేపట్టినప్పుడు ఏ ఒక్క ప్రాజెక్టులో కూడా సంస్థ డబ్బు పోకుండా పని పూర్తి కాలేదు. ఇది నిజం" అని ఆయన అన్నారు. సరైన సమయానికి సాంకేతికత లభ్యం కాకపోవడం, లంచగొండితనం భారత ఐటీ సంస్థలను పట్టి పీడిస్తున్నాయని ఆయన అన్నారు. అవరోధాలను తొలగించి సమస్యలను పరిష్కరిస్తే, ప్రభుత్వం తలపెట్టిన డిజిటల్ ఇండియా విజయవంతమవుతుందని, మొత్తం ఐటీ ఇండస్ట్రీ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తుందనడంలో సందేహం లేదని అన్నారు. కాగా, ఇన్ఫోసిస్ సంస్థ కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన హెల్త్ కేర్, ఇ-గవర్నెన్స్, అగ్రికల్చర్ తదితర రంగాల్లో వివిధ ప్రాజెక్టులను చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మారితేనే పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ప్రభుత్వాలతో చేతులు కలిపేందుకు ముందుకు వస్తాయని అన్నారు. విదేశీ కార్యకలాపాల్లో ఆకర్షణీయమైన ఆదాయం వస్తోందని తెలిపారు. డిజిటల్ ఇండియా ఊపందుకుంటే పెద్ద సంఖ్యలో ఉద్యోగ సృష్టి జరుగుతుందని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు.