: గ్రీస్ గట్టెక్కిందోచ్... ఇక 'దివాలా' అనిపించుకోదు!


ఆర్థిక ప్రపంచాన్ని భయపెట్టిన గ్రీస్ నిలదొక్కుకుంది. కష్టాల నుంచి బయటపడుతున్నామన్న సంకేతాలను పంపింది. దివాలా తీయకుండా గట్టెక్కింది. గతంలో తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించే పని మొదలు పెట్టింది. మూడు వారాల తరువాత బ్యాంకులను తెరిపించింది. గతవారం ఉద్దీపన సంస్కరణల కొత్త ప్యాకేజీకి ఓకే చెప్పిన గ్రీస్, 2 బిలియన్ యూరోలు (సుమారు రూ. 13,600 కోట్లు) రుణ దాతలకు తిరిగి చెల్లించింది. ప్రజలపై పన్నుల భారం మోపేందుకు గ్రీస్ సర్కారు అంగీకరించి విలువ ఆధారిత పన్నులను ప్రస్తుతమున్న 13 శాతం నుంచి ఏకంగా 23 శాతానికి పెంచింది. దీంతో ప్రజల నుంచి వచ్చే విమర్శలు ఎలాగున్నా, ఖజానాకు నిధులు సమకూరే మార్గం దగ్గరైంది. ప్రజా రవాణా వ్యవస్థ నుంచి ఆహార పదార్ధాల వరకూ ధరలు పెరిగాయి. గ్రీస్ ప్రజల్లో అత్యధికులు ఈ సంస్కరణలకు 'నో' చెప్పినప్పటికీ, ప్రపంచం ముందు చెడ్డపేరు తెచ్చుకోకూడదన్న ఉద్దేశంతో కఠిన నిర్ణయాల అమలుకే గ్రీస్ ప్రధాని అలెక్సిస్ మొగ్గు చూపారు. బ్యాంకులు తెరచుకోగానే వేలాది మంది డబ్బు డ్రా చేసుకునేందుకు క్యూలు కట్టారు. వారానికి కేవలం 420 యూరోలను మాత్రమే బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసుకోవాలని, ఈ నిర్ణయాన్ని భవిష్యత్తులో సడలిస్తామని ప్రభుత్వం వివరించింది. ఇదిలావుండగా, తదుపరి నిర్ణయం వెలువడేంత వరకూ స్టాక్ మార్కెట్ ను మాత్రం మూసే ఉంచుతామని తెలిపింది. మూలధన నియంత్రణే ప్రస్తుతం దేశం ముందున్న అతిపెద్ద సవాలని, దేశం కొత్త దిశా మార్గంలోకి నడుస్తున్న వేళ అంతా మంచిగా జరుగుతుందని భావిస్తున్నామని గ్రీక్ బ్యాంక్ అసోసియేషన్ హెడ్ లౌకా కట్సెలీ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News