: రాజమండ్రి తొక్కిసలాట ఘటనపై దర్శకుడు బోయపాటి వివరణ


గోదావరి పుష్కరాల తొలిరోజు రాజమండ్రిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై సినీ దర్శకుడు బోయపాటి శ్రీను వివరణ ఇచ్చారు. ఆ సమయంలో పలువురు మరణించడానికి కారణం సీఎం చంద్రబాబేనని, అందుకు తన దర్శకత్వంలో సీఎం సినిమా షూటింగ్ జరిపారని, దానివల్లే తొక్కిసలాట చోటుచేసుకుందంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. పుష్కరాల తొలిరోజు మహా హారతి కార్యక్రమ నిర్వహణ బాధ్యత తనకు అప్పగించారని చెప్పారు. దేశం నలుమూలల నుంచి వచ్చే యాత్రికులు హారతి చూసి మంచి అనుభూతి పొందుతారు కాబట్టి, ఆ సమయంలో రంగులను ఎలా ప్రెజెంట్ చేయాలన్న దానిపై తనకు అవగాహన ఉంటుందని పిలిపించారని తెలిపారు. అందుకే ఈ నెల 12న పుష్కర ఘాట్ కు వెళ్లి అక్కడి పరిసరాలను పరిశీలించానన్నారు. ఏం చేయాలో అప్పుడే ఆలోచించుకుని అధికారుల సహకారంతో స్థానికంగా ఉన్న దుకాణాల నుంచి కావల్సిన వస్తువులను కొన్నామన్నారు. గుంటూరు నుంచి గొడుగులు తెప్పించామని, హారతి కార్యక్రమం అద్భుతంగా ఉండేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. భక్తులంతా ఏర్పాట్లుచూసి ఆనందించాలన్నదే తమ ఏకైక ఉద్దేశమని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు కూడా తనకు అదే చెప్పారని బోయపాటి వివరించారు. అయితే 14న డాక్యుమెంటరీ తీయడంలాంటిదేమీ జరగలేదన్నారు. నిజానికి తనకు డాక్యుమెంటరీ తీసేంత సమయం కూడా లేదని, హారతి కార్యక్రమం బాగా వచ్చేలా చేయడమే తన పనని స్పష్టం చేశారు. 13 రాత్రి తన పని పూర్తవడంతో 14 ఉదయం 7.30కు గౌతమి పుష్కర ఘాట్ లో పుష్కర స్నానం చేసి హైదరాబాద్ కు వెళ్లిపోయానని బోయపాటి వెల్లడించారు.

  • Loading...

More Telugu News