: సమస్యలు పట్టని ఎమ్మెల్యేను కట్టేసిన ప్రజలు!
ఓట్ల కోసం ఊరూరా తిరిగిన ఆ రాజకీయ నేత... ఎక్కడ సమస్యలు తలెత్తితే అక్కడ వాలిపోతానంటూ హామీలు గుప్పించారు. ప్రజలు కూడా ఆయన మాటలు నమ్మారు. ఓట్లేసి గెలిపించారు. ఎన్నికల్లో గెలిచి చట్టసభలో అడుగుపెట్టగానే ఆ నేతాశ్రీ ఓటర్లకు ఇచ్చిన హామీలను మూటగట్టి అటకెక్కించారు. సమస్యల సుడిలో చిక్కుకున్న ప్రజల ఆగ్రహానికి గురై బందీ అయిపోయారు. రాజకీయ నేతలకు కనువిప్పు కలిగేలా ఉన్న ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మొఘల్ సరాయ్ నియోజకవర్గంలో నిన్న చోటుచేసుకుంది. నియోజకవర్గంలోని చందౌలీలో కొంతకాలంగా విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. ఫలితంగా ప్రజలకు మంచి నీళ్లు కూడా అందడం లేదు. సమస్య పరిష్కారం కోసం కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లభించలేదు. దీంతో ఆగ్రహించిన అక్కడి వారు తమ ఓట్లతో గెలిచిన స్థానిక ఎమ్మెల్యే, బీఎస్పీ నేత బాబన్ సింగ్ చౌహాన్ ను పట్టుకుని తాళ్లతో కట్టేశారు. స్థానిక కౌన్సిలర్ ను కూడా ఆయనతో పాటు కట్టిపడేశారు. సమాచారం అందుకున్న ఎస్పీ మునిరాజు అక్కడికి చేరుకుని చందౌలివాసులతో చర్చించి ఎమ్మెల్యేను బంధవిముక్తుడిని చేశారు. తనను నిర్బంధించిన చందౌలీవాసులపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఆయన చెప్పారు.