: కృష్ణమ్మను తాకిన గోదావరి రద్దీ!


గోదావరి పుష్కర యాత్రికుల రద్దీ నేడు విజయవాడ కృష్ణమ్మను తాకింది. పుష్కరాలు లేకపోయినా, ఎటువంటి పండగ రోజులు కాకున్నా, నేడు కృష్ణానదిలో లక్షల మంది స్నానాలు చేశారు. దీంతో ఇంద్రకీలాద్రి ఘాట్లు కిక్కిరిసి పోయాయి. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల యాత్రికులతో పాటు పుష్కరాల కోసం వచ్చిన తమిళనాడు, కర్ణాటక వాసులు పనిలో పనిగా దుర్గమ్మను దర్శించుకునేందుకు తరలి రావడమే ఇందుకు కారణం. దుర్గమ్మను దర్శించుకోవాలని వచ్చే భక్తులు కృష్ణలో పుణ్యస్నానాలు చేయడం పరిపాటి. ఈ నేపథ్యంలోనే కొండ కింద నదిలో, ఆపై దుర్గమ్మ చెంత రద్దీ విపరీతంగా పెరిగింది. అమ్మవారి దర్శనం కోసం సుమారు 60 వేల మంది వరకూ వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా ఈ పరిస్థితి దసరా నవరాత్రుల్లోనే కనిపిస్తుంది. పుష్కరాల తొలి నాలుగు రోజుల్లో రద్దీ పెద్దగా లేకపోవడంతో, అధికారులు సైతం కాస్తంత అలసత్వంతోనే ఉండడంతో కొండపై భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వేల సంఖ్యలో భక్తులు ఒక్కసారిగా చేరుకోవడంతో స్పందించిన అధికారులు ఈరోజు రాత్రంతా గుడిని తెరచే ఉంచుతామని, అందరికీ అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తామని చెప్పి, ప్రత్యేక అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు.

  • Loading...

More Telugu News