: గోత్రం పేరు చెప్పి భార్యను చెల్లిని చేసిన పంచాయతీ


ప్రేమించుకున్న ఆ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. వారి వైవాహిక ముచ్చట మూన్నాళ్లు కూడా నిలవకుండా చిక్కుల్లో పడింది. ఆ ఊరి పంచాయతీ, గోత్రం పేరు చెప్పి 'ఆమె నీ భార్య కాదు చెల్లెలు' అంటూ తీర్పిచ్చింది. దీంతో అవాక్కయిన ఆ జంట కోర్టును ఆశ్రయించింది. ఈ ఘటన హరియానా రాష్ట్రం జింద్ జిల్లా పరిధిలోని నర్వాన్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే, ప్రవీణ్‌ కుమార్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన పూనమ్‌ ను ప్రేమించాడు. వారిరువురూ ఐదు నెలల క్రితం పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వీరిద్దరి గోత్రాలూ ఒకటేనని హెచ్చరిస్తూ, వీరి వివాహం చెల్లదని స్థానికులు వాదించారు. విడిపోయేందుకు ఆ జంట నిరాకరించడంతో, విషయం ఖాప్ పంచాయతీ పెద్దల ముందుకు వచ్చింది. గోత్రాలు ఒకటే కాబట్టి వారు అన్నా చెల్లెళ్లు అవుతారే తప్ప భార్యాభర్తలు కాదని, పూనమ్ కు రూ. 10 భరణం ఇచ్చి విడాకులు ఇవ్వాలని పెద్దలు తీర్పిచ్చారు. దీనికి ప్రవీణ్ తండ్రి సైతం అంగీకరించకపోవడంతో, బహిష్కరణ శిక్ష విధిస్తామని బెదిరించారు. దీంతో ఆ జంట తమకు ప్రాణహాని ఉందని కోర్టును ఆశ్రయించడంతో, విచారణ చేపట్టిన న్యాయస్థానం, వారికి ప్రత్యేక రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది.

  • Loading...

More Telugu News