: టైటిల్ లోనే సందేశం... అదే 'శ్రీమంతుడి' గొప్పతనం: మంత్రి గంటా
'శ్రీమంతుడు' టైటిల్ అద్భుతంగా ఉందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరుగుతున్న 'శ్రీమంతుడు' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాలోని ట్రైలర్ ను రెండు సార్లు చూశానని, ట్రైలర్ లోనే అద్భుతమైన సామాజిక సందేశాన్ని అందించడం మహేష్ బాబు గొప్పదనమని అన్నారు. ఊరును దత్తత తీసుకోవడమంటే రెండు మొక్కలు వేసేసి చేతులు దులుపుకోవడం కాదని, అక్కడి ప్రజలకు ఉపయోగపడడమని అంతర్లీనంగా చెప్పడం సినిమాలోని కంటెంట్ ఔన్నత్యాన్ని బయటపెడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు. వంద రోజుల వేడుకలకు మరోసారి మహేష్ బాబు అభిమానులను కలుసుకుంటానని అన్నారు. ఈ సందర్భంగా 'శ్రీమంతుడు' సినిమాలోని మొదటి పాటను ఆవిష్కరించారు.