: మాజీ క్రికెటర్ అర్షద్ ఆయూబ్ పై చీటింగ్ కేసు
హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ అర్షద్ ఆయూబ్ పై మియాపూర్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. శేరిలింగంపల్లి మున్సిపాలిటీ పరిధిలో అర్షద్ ఆయూబ్ కొంత మందితో కలిసి 'స్కైటీ' పేరిట 2007లో రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రారంభించాడు. ప్లాట్లు కట్టిస్తామని చెప్పి పలువురి వద్దనుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఐదేళ్లయినా దాని నిర్మాణం పూర్తి కాకపోవడానికి తోడు, అనుమతులు లేకుండా 6, 7 అంతస్తుల నిర్మాణం ప్రారంభించాడు. ఇదేంటని ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురి చేశాడు. దీంతో పీజీకే నాయర్ అనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో అర్షద్ ఆయూబ్ ను అరెస్టు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో అతనిపై మియాపూర్ పోలీసులు 406, 409, 415, 420, 464, 468, 470, 471, 506, రీడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నాయర్ తరహాలోనే మరో ఐదుగురు పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం.