: మోదీ, షరీఫ్ లను సల్మాన్ సినిమా ఎందుకు చూడమన్నాడో తెలుసా?
ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన 'భజరంగీ భాయ్ జాన్' సినిమాను ఎందుకు చూడమన్నాడో తెలుసా?... దీని గురించి తెలుసుకోవాలంటే ముందు సినిమా గురించి కాస్త వివరంగా తెలుసుకోవాలి. సినిమా సామాజిక మాధ్యమం అని, సమాజంలోని సమకాలీన అంశాలను స్పృశిస్తూ వాస్తవాన్ని ప్రతిబింబించేదనే సూత్రాన్ని కమర్షియల్ సినిమాలు మర్చిపోయాయి. కాసులపంటే ధ్యేయంగా సినిమాలు నిర్మాణమవుతున్నాయి. సినిమా ద్వారా సమాజానికి అవసరమైన సందేశమివ్వడం సామాజిక బాధ్యత అని నిర్మాతలు మర్చిపోయారు. సినిమా లక్ష్యం మారిపోతున్న ఈ పరిస్థితుల్లో సల్మాన్ 'భజరంగీ భాయ్ జాన్' సినిమాతో ఈద్ కు సందడి చేశాడు. ఈ సినిమాలో సగటు భారత్, పాకిస్థానీల మనోభావాలను ప్రతిబింబించాడు. భారతీయులు ఇలా ఉంటారా? పాకిస్థానీలు ఇలా ఆలోచిస్తారా? అని భావించేలా తీశాడు. ఈ సినిమా హిందూ, ముస్లిం మతాలు, జాతీయ భావాలే మూల కథగా తయారైంది. సినిమాలో విద్వేష భావాలున్నా సానుకూల భావాలే ఎక్కువ. స్వచ్చమైన భారతీయుడు, అందులోనూ పల్లె నుంచి వచ్చిన భారతీయుడు ఎలా ఉంటాడన్న దానికి ప్రతిరూపంగా సల్మాన్ కనిపిస్తాడు. ఇమేజ్ ఛట్రం నుంచి బయటకు వచ్చి సల్మాన్ చూపిన నటనా కౌశలం అభినందించదగ్గదనడంలో ఎలాంటి సందేహం లేదు. సల్మాన్ అంటే మూడు ఫైట్లు, రెండు పాటలు, చొక్కా విప్పడాలు... అని ఫిక్సైపోయిన అభిమాని గుండెను ఈ సినిమా తట్టి లేపుతుంది. మాటలు రాని, మాంసాహారి అయిన పాక్ ముస్లిం చిన్నారిని... స్వచ్ఛమైన మనసున్న, హనుమాన్ భక్తుడైన శుద్ధ బ్రాహ్మణ యువకుడు పాకిస్థాన్ లోని తల్లి దగ్గరకు చేర్చడమే సినిమా కథ. సినిమాలో ఛైల్డ్ ట్రాఫికింగ్, ప్రాంతీయ విద్వేషాలు, మత వివాదాలు, వయసుల తారతమ్యాలు, మతాల సంప్రదాయాలు ఇలా చాలా సామాజిక అంశాలను కలుపుకుంటూ 'గాంధేయ వాదం గొప్పది' అనే సందేశం ఇవ్వడం విశేషం. అందుకే, సినిమా చూసిన తరువాతైనా ఇరు దేశాల ప్రధానుల దృక్పథంలో మార్పు వస్తుందని భావించిన సల్మాన్ షరీఫ్, మోదీని చూడమని పిలుపునిచ్చాడు.