: పూజారి 'ఉక్కు' సంకల్పం... కెన్యాలో కోట్లకు పడగలెత్తిన వైనం
దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చంటారు! అది నిజమేనని నిరూపించాడు నరేంద్ర రావల్ (53). ఆయనకి చెందిన దేవకి గ్రూప్ కెన్యాలో ఇప్పుడు అగ్రశ్రేణి పారిశ్రామిక సంస్థల్లో ఒకటిగా విలసిల్లుతోంది. కెన్యా ప్రభుత్వం కూడా రావల్ ను సముచిత రీతిలో గౌరవించింది. దేశంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన 'ఎల్డర్ ఆఫ్ ద బర్నింగ్ స్పియర్' తో సత్కరించింది. రావల్ వివరాల్లోకి వెళితే... గుజరాత్ లోని చిన్న పట్టణం మాతక్ ఆయన స్వస్థలం. 37 ఏళ్ల క్రితం ఆయన కెన్యా వలస వెళ్లారు. గుజరాతీల్లో అత్యధికుల మాదిరే అర్చకత్వం వైపు అడుగులేశారు. కెన్యాలోని కిసుము పట్టణంలో ఉన్న స్వామినారాయణ్ దేవాలయంలో సహాయక పూజారిగా చేరి, ఆపై కొంతకాలానికి పెళ్లి చేసుకుని ఓ హార్డ్ వేర్ షాపులో ఉద్యోగం సంపాదించారు. 1990 నాటికి గికోంబా మార్కెట్లో స్వంత షాపుకు ఓనరయ్యాడీ గుజరాతీ. భార్య నీతాతో కలిసి రోజుకు 18 గంటలు కష్టించాడట. 1992లో 70,000 డాలర్లు లోన్ తీసుకుని ఉక్కు వ్యాపారంలోకి ప్రవేశించడంతో ఆయన దశ తిరిగింది. అక్కడి నుంచి రావల్ వెనుదిరిగి చూసింది లేదు. వేల కోట్ల రూపాయల టర్నోవర్ సాధ్యమైంది. కెన్యాలోనే కాక, ఉగాండా, కాంగోలోనూ తన వ్యాపార సామ్రాజ్యం విస్తరించారాయన. ఉక్కు పరిశ్రమలే కాదు, సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా నెలకొల్పారు. ఆయన కంపెనీల సిబ్బందిలో 98 శాతం స్థానిక కెన్యన్లు, ఇతర ఆఫ్రికా దేశాల ప్రజలే ఉంటారు. ఇక, రావల్ లో దాతృత్వ లక్షణాలు కూడా మెండుగా ఉన్నాయి. అనాథాశ్రమాలు, నిరుపేద వర్గాలకు స్కూళ్లు ప్రారంభించారు. ఇటీవలే ఆయన ఓ విల్లు రాశారు. మరణానంతరం... తన కంపెనీల వార్షిక లాభాల్లో సగం కెన్యాలో విద్య, పౌష్టికాహారం, ఆరోగ్యం కోసం కేటాయిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. అహ్మదాబాద్ లో ఓ కార్యక్రమానికి వచ్చిన రావల్ మీడియాతో మాట్లాడుతూ... "నాపై మహాత్మాగాంధీ, మదర్ థెరెసా ప్రభావం చాలా ఎక్కువ. నా దృష్టిలో సంపద అనేది సమాజం మొత్తానికి చెందినది. ట్రస్టీలు, పౌరులు దాన్ని సమాజ హితానికి ఉపయోగించాలి. భారతీయులు నిజాయతీపరులు, కష్టించి పనిచేస్తారు, విధేయులుగా ఉంటారు. ప్రపంచంలో ఎక్కడైనా విజయం సాధించేందుకు ఈ లక్షణాలే తోడ్పడతాయి" అని వివరించారు.