: ప్రత్యూషను ఆదుకుంటానంటూ ముందుకొచ్చిన సినీ నటుడు పోసాని


సవతి తల్లి చేతిలో దారుణ హింసకు గురై ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్న ప్రత్యూష పరిస్థితిపై సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళీ స్పందించారు. ఆమెను పూర్తిస్థాయిలో ఆదుకునేందుకు ముందుకొచ్చారు. బాలిక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటి నుంచి పెళ్లయ్యే వరకు అన్ని ఖర్చులు తానే భరిస్తానని చెప్పారు. ప్రత్యూష బీఎస్సీ నర్సింగ్ చదవాలనుకుంటున్నట్టు తెలిసిందని, అది పూర్తి చేసి ఉద్యోగం వచ్చాక తన సాయం చాలు అనే వరకు ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటానని అన్నారు. ఈ ఘటన గురించి తెలిసినప్పటి నుంచి ఆదుకుంటామని చాలామంది చెప్పినవారే తప్ప ఏ ఒక్కరూ ముందుకు రాలేదన్నారు. సదరు బాలిక గాథ విని తానెంతో చలించిపోయానని, ఎంతగా ఏడ్చానో తనకు, తన భార్యకు మాత్రమే తెలుసునని ఓ తెలుగు చానల్ తో మాట్లాడుతూ చెప్పారు. ఇలాంటి ఘటనలు టీవీలో చూస్తున్నప్పుడు మనకెందుకులే అని చానల్ మార్చేస్తే మనం మనుషులమే కాదన్నారు. తాము కూడా ఒకప్పుడు బాగా బతికామని, ఉన్న డబ్బులు అయిపోయాక తన తండ్రి ఇబ్బందులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని పోసాని వెల్లడించారు. దాంతో తాను దొంగనో, రౌడీనో కావలసిన వాడినని, కానీ రచయితలు పరుచూరి బ్రదర్స్ దయతో క్రమశిక్షణలో మెలిగి ప్రయోజకుడినయ్యానని చెప్పుకొచ్చారు. అందుకే తీవ్ర ఇబ్బందులు పడేవారిని చూస్తే చాలా బాధపడతానని, వెంటనే స్పందిస్తానని అన్నారు. ప్రత్యూష కేసులో తనకే గనుక తీర్పు ఇచ్చే అవకాశం వస్తే ఆ తండ్రి, తల్లికి వెంటనే ఉరిశిక్ష వేసి, అదేరోజు అమలు చేయాలని చెబుతానన్నారు. ఆ సవతి తల్లి అసలు ఆడదేనా? అని పోసాని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News