: బీటెక్ విద్యార్థిని సూసైడ్ కు ర్యాగింగే కారణం...పోలీసుల అదుపులో ముగ్గురు సీనియర్లు
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న వరంగల్ జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థిని రిషికేశ్వరి ఘటనకు ర్యాగింగే కారణమన్న వాదన వినిపిస్తోంది. గుంటూరులోని వర్సిటీ క్యాంపస్ లో మొన్న రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై జరిగిన ప్రాథమిక విచారణలో సీనియర్ల ర్యాగింగ్ నేపథ్యంలోనే రిషికేశ్వరి సూసైడ్ చేసుకుందని తేలింది. దీంతో రిషికేశ్వరిపై ర్యాగింగ్ కు పాల్పడ్డ ముగ్గురు సీనియర్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే, రిషికేశ్వరిపై ర్యాగింగ్ కు పాల్పడ్డ ఇద్దరు సీనియర్లు జయచరణ్, శ్రీనివాస్ లను వర్సిటీ నుంచి సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ నిన్న నిర్ణయం తీసుకున్నారు. ఇక రిషికేశ్వరిపై ర్యాగింగ్ కు పాల్పడ్డ మూడో సీనియర్ విద్యార్థిని కావడం గమనార్హం. రిషికేశ్వరితో కలిసి ఒకే గదిలో ఉంటున్న అనిషా అనే విద్యార్థిని, సీనియర్ అబ్బాయిలతో చనువుగా ఉండాలని రిషికేశ్వరిపై తీవ్ర ఒత్తిడి చేసిందన్న పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళనలకు దిగాయి.