: ‘చౌక కారు’ ప్రచారమే ‘నానో’ కొంపముంచింది: రతన్ టాటా వ్యాఖ్య
‘నానో’ పేరిట టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ రతన్ టాటా రూపొందించిన చిన్న కారు ప్రచారంలో జరిగిన తప్పిదాల వల్లే అట్టర్ ఫ్లాప్ అయ్యిందట. ఈ విషయాన్ని రతన్ టాటానే స్వయంగా వెల్లడించారు. నిన్న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అందరికీ అందుబాటులో ఉండే కారు’ అనే నినాదం బదులు ‘చౌక కారు’ అన్న ప్రచారమే తమ బృహత్ ప్రయత్నాన్ని దెబ్బతీసిందని ఆయన పేర్కొన్నారు. 25-26 ఏళ్ల సగటు వయస్సున్న ఔత్సాహికుల బృందమే నానోను డిజైన్ చేసిందని చెప్పిన టాటా, ప్రచారంలో చేసిన చిన్న పొరపాటు ఆ యువకుల శ్రమను వృథా ప్రయాసగా మార్చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక బెంగాల్ నుంచి తమ తయారీ ప్లాంట్ ను సనంద్ కు మార్చేందుకు పట్టిన ‘ఏడాది సమయం’ కూడా నానోను ఫ్లాప్ చేసిన కారణాల్లో ఒకటిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.