: పాలమూరు ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రాని టీడీపీ నేతలు... తోకముడిచారంటున్న జూపల్లి
హైదరాబాదులోని అసెంబ్లీ కమిటీ హాలులో బుధవారం పాలమూరు ప్రాజెక్టుపై బహిరంగ చర్చ ఏర్పాటు చేశారు. చర్చకు వస్తానన్న టీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి ఎంతకీ రాకపోవడంతో, తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియా సాక్షిగా విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ నేతలు తోక ముడిచారని ఎద్దేవా చేశారు. రావుల గైర్హాజరీతో తెలంగాణ టీడీపీ నేతలు మాటలకే పరిమితమన్న విషయం స్పష్టమైందని అన్నారు. చర్చకు వస్తేనే వాస్తవాలు తెలుస్తాయని హితవు పలికారు. అసెంబ్లీ కమిటీ హాల్ కు రావడం టీడీపీ నేతలకు ఇష్టంలేకపోతే హైదరాబాదులోని ఏ ఫంక్షన్ హాల్ లో చర్చకు పిలిచినా తాను వస్తానని సవాల్ విసిరారు. అందుకయ్యే ఖర్చులు కూడా తానే భరిస్తానని తెలిపారు.