: మాజీ మంత్రి మారెప్పకు తృటిలో తప్పిన ప్రమాదం... స్వల్ప గాయాలు
మాజీ మంత్రి మారెప్పకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే, నిన్న హైదరాబాదు నుంచి కర్నూలుకు తన అనుచరులతో కలసి ఇన్నోవా కారులో మారెప్ప వెళుతుండగా... దివిటిపల్లి సమీపంలో ముందు వెళుతున్న లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో, వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మారెప్పకు స్వల్ప గాయాలయ్యాయి. అదే కారులో ప్రయాణిస్తున్న మారెప్ప సోదరుడు జోజెప్ప, మాజీ ఎమ్మెల్యే దార సాంబయ్య, బీజేపీ దళిత మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాములుకు ఎలాంటి గాయాలు తగలలేదు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు.