: ‘వేం’ కొడుకు ఆరో ‘కృష్ణు’డేనా?...మరికాసేపట్లో ఏసీబీ ముందుకు కృష్ణకీర్తన్
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేసినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి(ఏ1)తో పాటు మధ్యవర్తులుగా వ్యవహరించిన సెబాస్టియన్(ఏ2), ఉదయసింహ(ఏ3), జెరూసలెం మత్తయ్య(ఏ4)లను ఏసీబీ అధికారులు నిందితులుగా చేర్చారు. ఇక నిన్న బెయిల్ మంజూరై జైలు నుంచి విడుదలైన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను కూడా ఈ కేసులో ఏ5 నిందితుడిగా పేర్కొన్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. నిన్న సెక్షన్ 160 ప్రకారం జారీ అయిన నోటీసుల్లో నేటి ఉదయం 10.30 గంటలకు తమ ముందు విచారణకు హాజరుకావాలని ఏసీబీ అతడిని కోరింది. కేసులో లభించిన ఫోన్ సంభాషణలను ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరీక్షించిన మీదట ఏసీబీకి పలు కీలక ఆధారాలతో పాటు, కేసులో కీలక వ్యక్తుల ప్రమేయం కూడా వెల్లడైందట. ఈ ఆధారాలతోనే కృష్ణకీర్తన్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అంతేకాక కృష్ణకీర్తన్ ను కేసులో ఏ6 నిందితుడిగా చేర్చేందుకు కూడా ఏసీబీ సన్నాహాలు చేస్తోందని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న కృష్ణకీర్తన్ ఈ కేసులో ఇరుక్కుంటే అతడి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదన్న ఆందోళన వేం నరేందర్ రెడ్డి కుటుంబాన్ని వేధిస్తోంది.