: రాజమండ్రి పుష్కరఘాట్ ప్రమాదం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్... ప్రగాఢ సానుభూతి
రాజమండ్రిలోని ప్రధాన ఘాట్లలో ఒకటైన కోటగుమ్మం ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఇప్పటి వరకు 17 మంది మృత్యువాత పడగా, మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత భక్తి భావంతో, పుష్కర స్నానాలను ఆచరించడానికి వచ్చిన సమయంలో ఇలా జరగడం కలచివేసిందని చెప్పారు. ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎలాంటి ఆటంకాలు జరగకుండా పుష్కరాలు కొనసాగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. భక్తులు కూడా సంయమనంతో పుష్కర స్నానాలు ఆచరించాలని సూచించారు.