: ఆ ‘ఫైలు’ పంపమనలేదు... వివాదాన్ని త్వరగా తేల్చమన్నానంతే!: మంత్రి పీతల సుజాత
ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత వివాదం నుంచి బయటపడేందుకు మరోమారు యత్నిస్తున్నారు. తన సొంత నియోజకవర్గంలోని ఓ భూ వివాదంలో తలదూర్చిన మంత్రి, సదరు భూమికి సంబంధించిన ఫైలును తనకు పంపాలని రెవెన్యూ, అటవీ శాఖలకు ఆదేశాలు జారీ చేశారన్న వార్తలతో నిన్న కలకలం రేగింది. దీంతో నేరుగా మీడియా ముందుకు వచ్చిన మంత్రి ‘‘నామవరంలోని రెండు వర్గాల మధ్య ఈ భూమికి సంబంధించి వివాదం కొనసాగుతోంది. వివాద పరిష్కారం కోసం రెండు వర్గాలు నా వద్దకు వచ్చాయి. దీంతో వివాదాన్ని సాధ్యమైనంత త్వరగా తేల్చాలని అధికారులకు సూచించాను. అంతే తప్ప, ఫైలును నా వద్దకు పంపమని ఎవరినీ ఆదేశించలేదు’’ అంటూ వివరణ ఇచ్చారు.