: ఆ కిడ్నాపర్ బీహారీ అట... కోల్ కతాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు


హైదరాబాదులోని రాజేంద్రనగర్ కు చెందిన వివాహితను అపహరించిన కిడ్నాపర్ ను ఎట్టకేలకు సైబరాబాదు పోలీసులు పట్టేశారు. మూడు రోజుల క్రితం రాజేంద్రనగర్ కు చెందిన వివాహితను కిడ్నాప్ చేసిన అతడు, ఆమెను ఒడిశా మీదుగా కోల్ కతా తరలించాడు. ఆ తర్వాత ఆ మహిళను విడిచిపెట్టాలంటే రూ.3 లక్షలు ఇవ్వాల్సిందేనని ఆమె భర్తకు వాట్సప్ లో మెసేజ్ పెట్టాడు. దీంతో బాధితురాలి భర్త సైబరాబాదు పోలీసులను ఆశ్రయించారు. వెనువెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ ఆచూకీ కోసం పలు కోణాల్లో దర్యాప్తు సాగించారు. ఈ క్రమంలో అతడు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో అక్కడకు వెళ్లిన పోలీసులు చాకచక్యంగా అతడిని అదుపులోకి తీసుకుని, అతడి చెర నుంచి బాధితురాలికి విముక్తి కల్పించారు. విచారణలో భాగంగా సదరు కిడ్నాపర్ బీహార్ కు చెందిన వాడని తేలింది. అంతేకాక అతడు బాధితురాలికి పరిచయస్తుడేనని కూడా పోలీసులు నిర్ధారించారు. ఇక కేవలం డబ్బు కోసమే అతడు బాధితురాలిని కిడ్నాప్ చేశాడట. కోల్ కతా నుంచి అతడిని హైదరాబాదుకు తీసుకువస్తున్న పోలీసులు, నేడు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News