: చంద్రబాబుకు హైదరాబాద్ వదిలి వెళ్లాలనిపించడంలేదు: హరీశ్
తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఏపీ సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబుకు హైదరాబాద్ వదిలి వెళ్లాలనిపించడంలేదని అన్నారు. హైదరాబాదుకు తాగునీరు రాకుండా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, సీఎం కేసీఆర్ వేసిన ప్రతి అడుగు పేదల పక్షమేనని ఉద్ఘాటించారు. హైదరాబాదులో వచ్చే ఏడాదిలోగా లక్షమందికి ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. ముఖ్యంగా, చెత్తసేకరణకు 2 వేల ఆటోలు కొంటామని అన్నారు. అటు, టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీ సర్కారు ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనేందుకు ప్రయత్నించిందని వార్తలు వస్తున్నాయని అన్నారు. చంద్రబాబుకు ఫోన్ ట్యాపింగ్ పై మాట్లాడే అర్హత లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. తెలంగాణపై చంద్రబాబు కుళ్లు బుద్ధి చూపిస్తున్నారని ఆమె మండిపడ్డారు.