: అరెస్టు చేసేందుకు ఈడీ అధికారులొస్తే చక్కెర మెక్కి షుగర్ లెవల్స్ పెంచుతాడు!
పోలీసులు ఎవరైనా ప్రముఖులను, నేతలను అరెస్టు చేయగానే వారు గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరడం సర్వసాధారణంగా మారిపోయింది. కానీ, ఈ వ్యక్తి చాలా డిఫరెంటు. ఆ వివరాల్లోకెళితే... దుల్రాజ్ జైన్ అనే వ్యక్తి ఓ హవాలా కేసులో నిందితుడు. రూ.5,395 కోట్ల సూరత్ హవాలా రాకెట్ తో సంబంధం ఉన్నట్టు జైన్ పై ఆరోపణలున్నాయి. అతడిని అరెస్టు చేసేందుకు అధికారులు వెళ్లగానే, కిలోలకొద్దీ చక్కెర మెక్కేస్తాడు. ఇంకేముందీ... రక్తంలో చక్కెర స్థాయి రాకెట్ లా దూసుకుపోతుంది. ఆ విధంగా అరెస్టు తప్పించుకోవడం చేసేవాడు. అన్నట్టు... జైన్ ఓ మంచి నటుడిగానూ సుప్రసిద్ధుడట. దాంతో, అరెస్టు చేసేందుకు అధికారులొస్తే, తీవ్ర అనారోగ్యం పాలైనట్టు నాటకం ఆడేవాడు. ఆసుపత్రికి తీసుకెళ్లి చెకప్ చేయిస్తే, బ్లడ్ షుగర్ ప్రమాదకర స్థాయిలో ఉండేది. డాక్టర్లు ప్రాణాలకు ముప్పు అని చెప్పేవారు. కిందటి నెలలోనూ ఈడీ అధికారులు అతడి నివాసానికి వెళ్లగా, పాత డ్రామాకు తెరదీశాడట. జైన్ పై కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.