: ప్రకాశం జిల్లాలో కానిస్టేబుళ్లకు దేహశుద్ధి చేసిన ప్రజలు
ఓ విద్యార్థినిని వేధిస్తున్న కానిస్టేబుళ్లకు ప్రజలు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండలో జరిగింది. వివరాల్లోకి వెళితే, రామాయపట్నం వద్ద విధులు నిర్వహించే ఇద్దరు కానిస్టేబుళ్లు నాగరాజు, ఖాదర్ మస్తాన్ రోజూ చీరాల నుంచి రైలులో వచ్చి పోతుంటారు. ఈ ఉదయం తన స్నేహితురాళ్లతో కలసి రైలులో ప్రయాణిస్తున్న విద్యార్థినిని వారు వేధించారు. బాధితురాలు తన తండ్రి రవిబాబుకు విషయం తెలిపి విలపించింది. తండ్రీ, కూతురు కలసి వెళుతుండగా, రైల్వే స్టేషను రోడ్డులోని ఓ హోటల్ లో టిఫిన్ చేస్తున్న సదరు కానిస్టేబుళ్లు కనిపించారు. దీంతో రవిబాబు వేధింపుల విషయమై ప్రశ్నించగా, కానిస్టేబుళ్లు దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు చేరుకుని వారిని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదైందా? లేదా? అన్న విషయం తెలియరాలేదు.