: కంపు కొడుతున్న హైదరాబాద్... ఆందోళనలో ప్రజలు
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని నగరం హైదరాబాద్ వీధులలో దుర్గంధం నిండిపోయింది. ఏ వీధిలో చూసినా చెత్తా చెదారం గుట్టలుగా పేరుకుపోయింది. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ఏడవ రోజుకు చేరగా, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదముందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో వర్షాలు పడితే ప్రమాదకర రోగాలు వెన్నంటి వస్తాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనావాసాల మధ్య పేరుకుపోయిన చెత్త కుప్పలను తక్షణం ఏరివేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ ఉదయం పలు ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు పోలీసులు యత్నించగా, వారిని కార్మికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తమ వేతనాలు పెంచాలని, డిమాండ్లను తక్షణం నెరవేర్చాలని కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.