: వైఎస్సార్సీపీలో చేరే ప్రసక్తే లేదు: డొక్కా మాణిక్యవర ప్రసాద్
ఈ నెల 13న వైఎస్సార్సీపీలో చేరనున్నారన్న వార్తలపై మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ స్పందించారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీలో చేరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. గతేడాది ఆగస్టులో టీడీపీలో చేరేందుకు ముహూర్తం సిద్ధం చేసుకున్న డొక్కా చేరికపై స్థానిక టీడీపీ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. తిరిగి ఇన్నాళ్లకు వైఎస్సార్సీపీలో చేరనున్నట్టు సన్నిహితులతో పేర్కొన్నారు. ఈ నెల 13న దానికి ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు. దీంతో 'డొక్కా మాకు సోదరుడు లాంటి వాడు. ఆయన వైఎస్సార్సీపీలో చేరడు' అంటూ ఆయన రాజకీయ గురువు రాయపాటి సాంబశివరావు పేర్కొనడంతో డొక్కా తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. దీంతో, తాను వైఎస్సార్సీపీలో చేరనని, కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇందుకు రాయపాటి ప్రణాళిక సిద్ధం చేశారని కూడా వారు చెబుతున్నారు. దీంతో డొక్కా వైఎస్సార్సీపీ ప్రవేశం లేనట్టేనని వారు స్పష్టం చేస్తున్నారు.