: కేసీఆర్! గిమ్మిక్కు రాజకీయాలకు స్వస్తి చెప్పు...పాలనపై దృష్టి పెట్టు: నాగం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గిమ్మిక్కు రాజకీయాలకు స్వస్తి చెప్పి, పరిపాలనపై దృష్టి పెట్టాలని బీజేపీ నేత నాగం జనార్దనరెడ్డి సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, అధికారంలో ఉండి బంద్ చేయడం కేసీఆర్ కే చెల్లిందని ఎద్దేవా చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం మానేసి, బంద్ లు చేస్తే పూర్తవుతాయా? అని ఆయన ప్రశ్నించారు. బంద్ పేరిట మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను అసౌకర్యానికి గురిచేసినందుకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకంపై అభిప్రాయం చెప్పమని ఏపీ కోరిందే తప్ప, ప్రాజెక్టును ఆపమని కోరలేదని ఆయన స్పష్టం చేశారు. అయినా పొరుగు రాష్ట్రాలతో సమస్యలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.