: చింతమనేని... దూకుడు తగ్గించు!: ప్రభుత్వ విప్ కు చంద్రబాబు మందలింపు
ఇసుకను అక్రమంగా తరలించడమే కాకుండా అడ్డుకోబోయిన మహిళా తహశీల్దార్ పై అనుచరులతో కలిసి దాడికి దిగిన ఏపీ ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సుతిమెత్తగా మందలించారట. ఎమ్మెల్యే దాడితో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల ఆందోళనను విరమించేందుకు రంగంలోకి దిగిన చంద్రబాబు, నేటి ఉదయం హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. బాధిత తహశీల్దార్ తో పాటు చింతమనేనిని కూడా చంద్రబాబు ఈ భేటీకి పిలిపించారు. ఈ సందర్భంగా చింతమనేనిని చంద్రబాబు మందలించారట. మహిళా అధికారిణిపై దాడితో జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని, నాయకత్వ లక్షణాలున్న మీకు ఇది తగదని చింతమనేనికి చంద్రబాబు సూచించారట. ఇకనైనా ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించిన చంద్రబాబు, దూకుడు తగ్గించుకోవాలని చింతమనేనిని హెచ్చరించారట.