: కేసీఆర్ కేబినెట్ పై కూతురు విమర్శ...మహిళలు లేకపోవడం బాధిస్తోందని కామెంట్!


తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంత్రివర్గంలో మహిళలకు ఇప్పటిదాకా ప్రాతినిధ్యమే దక్కలేదు. దీనిపై విపక్షాలతో పాటు ప్రజా సంఘాలు కూడా కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఏకంగా మహిళలతో భారీ నిరసన ప్రదర్శన కూడా చేపట్టారు. తాజాగా ఈ విషయంపై తన కూతురు, నిజామాబాదు ఎంపీ కవిత నుంచి కూడా కేసీఆర్ కు విమర్శలు ఎదురయ్యాయి. తెలంగాణ కేబినెట్ లో మహిళలకు ప్రాతినిధ్యం లేకపోవడం తనను కూడా బాధిస్తోందని ఆమె నిన్న వ్యాఖ్యానించారు. అంతేకాక ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిలో తాను కూడా ఉన్నానని ఆమె పేర్కొన్నారు. నిన్న హైదరాబాదులోని పార్క్ హయాత్ హోటల్ లో ఫిక్కీ ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో ‘భవిష్యత్తు భారతంలో మహిళల ముందంజ’ అనే అంశంపై జరిగిన సమావేశానికి కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా కేబినెట్ లో మహిళలకు చోటు దక్కని విషయంపై ఫిక్కీ సభ్యురాలు ఒకరు సంధించిన ప్రశ్నకు కవిత పై విధంగా స్పందించారు. తన తండ్రి కేబినెట్ లో మహిళలకు చోటు దక్కకపోవడంపై కాస్తంత నిరాశ వ్యక్తం చేసిన ఆమె, అందుకు తగ్గ కారణాలను కూడా వివరించే యత్నం చేశారు. వివిధ సమీకరణాల నేపథ్యంలోనే కేబినెట్ లో మహిళలకు చోటు దక్కలేదని కవిత చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News