: మలయాళంలో విడుదల కాని బాహుబలి
ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాహుబలి సినిమా మలయాళంలో మాత్రం ఈరోజు విడుదల కాలేదు. మలయాళం వెర్షన్ ఆడియో ఫంక్షన్ ఘనంగా నిర్వహించి, బాహుబలిపై కేరళలో ప్రచారం చేశారు. అయితే, పైరసీ నిర్మూలనకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఫిల్మ్ ఎగ్జిబిటర్ల ఫెడరేషన్ నిన్నటి నుంచి ఆందోళన నిర్వహిస్తోంది. సినిమా విడుదలైన రెండో రోజే పైరసీ కారణంగా బయటకు వచ్చేస్తే, డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడని వారు ఆందోళనకు దిగారు. దీనిపై చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ కేరళలో ఉన్న 400 సినిమా ధియేటర్లు మూసేశారు. ఆందోళన రెండో రోజుకు చేరుకున్నా ఎలాంటి ఫలితం లేకపోవడంతో నేడు ఎగ్జిబిటర్ ఫెడరేషన్ సమావేశం కానుంది. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనుంది. కాగా, సోషల్ మీడియా విస్తృతమైన ప్రస్తుత కాలంలో బాహుబలి సినిమాపై ప్రచారాన్ని ఆపగలిగే సౌకర్యం లేదు. దీంతో కేరళలో డిస్ట్రిబ్యూటర్ ఎంతో కొంత నష్టపోక తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి.