: విమానం ల్యాండింగ్ కు కారణమైన భార్యాభర్తలు
కర్ణుడిచావుకి సవాలక్ష కారణాలన్నట్టు...విమానాలు అత్యవసర ల్యాండింగ్ కు కూడా సవాలక్ష కారణాలున్నాయి. ఎలుకలు, తేనెటీగలు, ఉగ్ర భయాలు, సాంకేతిక, వాతావరణ కారణాలకు తోడు మానవ వ్యవహార శైలి కూడా విమానాల అత్యవసర ల్యాండింగ్ కు కారణమవుతున్నాయి. తాజాగా భార్యాభర్తల కీచులాట విమానాన్ని అత్యవసరంగా కిందికి దించేందుకు కారణమైంది. లండన్ నుంచి హ్యూస్టన్ వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానంలో ఓ ప్రయాణికుడు భార్యపై దాడికి దిగాడు. దీంతో విమాన సిబ్బంది, సహప్రయాణికులు కలుగజేసుకుని అతనిని నిలువరించేందుకు ప్రయత్నించగా, ఆయన వారిపై కూడా విరుచుకుపడ్డాడు. దీంతో విమానాన్ని బోస్టన్ నగరంలోని లోగన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు. సిబ్బంది, తోటి ప్రయాణికులతో అభ్యంతరకరంగా ప్రవర్తించిన అతనిని దించేసి పోలీసులకు అప్పగించారు, దీంతో అతనిపై పలు సెక్షన్లపై కేసులు నమోదు చేశారు.