: తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వాట్స్ యాప్ ట్రిక్స్ అండ్ టిప్స్
వాట్స్ యాప్... సామాజిక మాధ్యమాల్లో శరవేగంగా విస్తరిస్తున్న అప్లికేషన్. టెక్ట్స్ మెసేజ్ లను పంపడం దగ్గర్నుంచీ, ఉచితంగా కాల్స్ చేసుకునేంత వరకూ పలు రకాలుగా ఇది ఉపయోగపడుతోంది. అందుకే వాట్స్ యాప్ ను వాడుతున్న వారి సంఖ్య 80 కోట్లను దాటిపోయింది. మీరు వాట్స్ యాప్ వాడుతున్నట్లయితే, మీకోసం కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్... మీరు పంపిన వాట్స్ యాప్ మెసేజిని అవతలివారు చదివారా? లేదా? అన్న విషయాన్ని తెలుసుకోవాలి. వాట్స్ యాప్ లో మెసేజ్ పంపిన తరువాత ఆ మెసేజ్ మీ ఫోన్ నుంచి వెళితే ఒక 'టిక్' మార్క్, ఆపై టార్గెట్ మొబైల్ కు చేరితే రెండు 'టిక్' మార్కులు, దాన్ని అవతలివారు ఓపెన్ చేసి చూస్తే ఆ 'టిక్'ల రంగు 'బ్లూ'లోకి మారుతుంది. మరింత సమాచారం కావాలంటే మెసేజ్ పై రెండు సెకన్లపాటు నొక్కి పట్టి ఆపై ఇన్ఫో ఐకాన్ ను టచ్ చేస్తే, మెసేజ్ డెలివరీ, అది చదివిన ఎగ్జాక్ట్ టైం తెలుస్తుంది. మీరు పాత ఫోన్ ను రీప్లేస్ చేసినా, లేదా ఓ కొత్త ఐఫోన్ కు మారినా, మీ వాట్స్ యాప్ చాట్ హిస్టరీని తీసుకెళ్లొచ్చు. దీనికోసం మెనూలోని సెట్టింగ్స్ ఓపెన్ చేసి చాట్ సెట్టింగ్స్ కు వెళ్లి బ్యాకప్ కన్వర్జేషన్స్ క్లిక్ చేసి ఎస్ డీ కార్డులోకి సమాచారాన్ని బట్వాడా చేసుకోవచ్చు. అదే కార్డును కొత్త ఫోన్లోకి పెట్టి పాత చాటింగు మొత్తాన్నీ రీస్టోర్ చేసుకోవచ్చు. గూగుల్ డ్రైవ్ సౌకర్యాన్ని వినియోగించుకుంటూ ఉన్నట్లయితే, దాని ద్వారా కూడా ఈ సదుపాయం పొందవచ్చు. ఒకే సమాచారాన్ని పలువురికి పంపాలని భావిస్తే వాటిని గుత్తంగా (బల్క్) పంపే సదుపాయం వాట్స్ యాప్ అందిస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్స్ యాప్ మెనూ ఓపెన్ చేసి 'న్యూ బ్రాడ్ కాస్ట్'ను టచ్ చేయడం ద్వారా కొత్త గ్రూప్ ను క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతిరోజూ తెల్లవారుఝామున 4 గంటలకు వాట్స్ యాప్ ఆటోమేటిక్ గా మీ మెసేజ్ లను బ్యాకప్ చేస్తుంది. ఒకవేళ మీరు డిలీట్ చేసిన మెసేజ్ లను తిరిగి పొందాలంటే యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేసి తిరిగి ఇన్ స్టాల్ చేసుకుంటే సరి. ఆ సమయంలో బ్యాకప్ రీస్టోర్ సౌకర్యం కావాలా? అని అడిగినప్పుడు 'యస్' అంటే సరి. అయితే, ఇది కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజరును వాడుతున్నట్లయితే, సాధ్యమైనంత వరకూ, అంటే సిస్టమ్ వాడుతున్నంత సేపూ వాట్స్ యాప్ ను కంప్యూటర్ మాధ్యమంగా వినియోగించడం ద్వారా మొబైల్ డేటాను సేవ్ చేసుకోవచ్చు. మీ కెమెరా రోల్ చిత్రాల్లో వాట్స్ యాప్ ఇమేజ్ లను చూపించకుండా ఉండేలా సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా మీవైన 'ప్రైవేటు' చిత్రాలను దాచుకునే సదుపాయం కూడా ఉంది. ఇందుకోసం ఐఓఎస్ యూజర్లు సెట్టింగ్స్ లోకి వెళ్లి ప్రైవసీ బటన్ ప్రెస్ చేసి 'ఫోటోస్ అండ్ టొగుల్ వాట్స్ యాప్'ను ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఆండ్రాయిడ్ వాడుతున్నట్లయితే, ఎస్ డీ కార్డులోని వాట్స్ యాప్/మీడియాకు వెళ్లి ఎడమవైపున్న బటన్ నొక్కి 'నో మీడియా' అనే ఫైల్ ను క్రియేట్ చేస్తే మీ చిత్రాలు గ్యాలరీలో కనిపించవు. వీటితో పాటు రెగ్యులర్ చాట్స్ కోసం షార్ట్ కట్, నోటిఫికేషన్స్ మ్యూట్ చేసుకునే సదుపాయం, వాట్స్ యాప్ ను పిన్ నంబరుతో లాక్ చేసుకునే సౌకర్యం, 'లాస్ట్ సీన్' టైం స్టాంపును దాచేసే ఫెసిలిటీ వంటివెన్నో వాట్స్ యాప్ అందిస్తోంది.