: నా పర్సనల్ లైఫ్ తో ఆయనకేం పని?...చింతమనేని వ్యాఖ్యలపై మహిళా తహశీల్దార్ ఆవేదన
టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హద్దులు దాటి మాట్లాడుతున్నారని ముసునూరు తహశీల్దార్ వనజాక్షి కన్నీటిపర్యంతమయ్యారు. అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడుతున్న చింతమనేని ట్రాక్టర్లను సీజ్ చేసేందుకు వెళ్లిన వనజాక్షి, ఆమె కార్యాలయ సిబ్బందిపై నిన్న చింతమనేని, ఆయన గన్ మెన్లు దాడి చేశారు. ఈ దాడిపై వనజాక్షి ముసునూరులో ఫిర్యాదు చేయగా, డ్వాక్రా మహిళలు వనజాక్షిపై పెదవేగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నేటి ఉదయం విజయవాడలోని కృష్ణా జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలతో కలిసి వనజాక్షి మీడియాతో మాట్లాడారు. అక్రమాలకు పాల్పడ్డ చింతమనేని ప్రభాకర్, తనను నిలువరించేందుకు వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ విషయాల గురించి చితంమనేని అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. అసలు తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే హక్కు చింతమనేనికి ఎవరిచ్చారని ఆమె ప్రశ్నించారు. ఈ తరహా దాడులతో మహిళా ఉద్యోగులు విధులు నిర్వర్తించలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆమె మీడియా సమావేశంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు.