: 'రెండ్రోజుల్లోగా చింతమనేనిపై చర్యలు తీసుకోవాల్సిందే...లేదంటే ఉద్యమమే'నంటున్న ఏపీ రెవెన్యూ ఉద్యోగులు
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు కలసి కృష్ణా జిల్లా ముసునూరు మండలం రంగంపేటలో తహశీల్దార్ వనజాక్షిపై చేసిన దాడిపై ఏపీ రెవెన్యూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తహశీల్దార్ ఫిర్యాదుతో ఎమ్మెల్యేపై ముసునూరు పోలీసులు ఐపీసీ 353, 334, 379 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదైనా ఎమ్మెల్యే ఇంకా అరెస్ట్ కాలేదు. దీనిపై ఏపీ రెవెన్యూ ఉద్యోగులు... పోలీసులు, ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసుల నమోదుతో సరిపెడితే కుదరదని, ఎమ్మెల్యేపై రెండు రోజుల్లోగా చర్యలు తీసుకోకుంటే, ఉద్యమ బాట పట్టకతప్పదని వారు హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తులో ఈ తరహా దాడులకు అడ్డుకట్టపడేలా చట్టాలను కఠినతరం చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు.