: గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప ఆరోపణలపై గోపీచంద్ స్పందన


భారత బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణులు గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప చేసిన ఆరోపణలపై భారత చీఫ్ కోచ్ గోపీచంద్ స్పందించారు. తాము నిరాదరణకు గురవుతున్నామని వారు ఆరోపించడాన్ని ఆయన కొట్టిపారేశారు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్), భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్), కేంద్ర ప్రభుత్వం నుంచి జ్వాల, పొన్నప్ప జోడీ అన్ని విధాలా సహాయం అందుకుంటోందని స్పష్టం చేశారు. అయినాగానీ, తమనెవరూ పట్టించుకోవడం లేదని వారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల జ్వాల, పొన్నప్ప కెనెడియన్ ఓపెన్ లో డబుల్స్ టైటిల్ నెగ్గిన తర్వాత గోపీచంద్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. బ్యాడ్మింటన్ ప్లేయర్లందరినీ సమానంగా చూడాలని, లేకుంటే, కోచ్ పదవి నుంచి తప్పుకోవాలని అన్నారు. రియో ఒలింపిక్స్ కోసం ప్రవేశపెట్టిన టార్గెట్ ఒలింపిక్ పోడియం (టీఓపీ-టాప్) పథకంలో తమకు స్థానం కల్పించకపోవడాన్ని వారు తప్పుబట్టారు. వారి వ్యాఖ్యలపై స్పందించిన గోపి... "ఇటీవల వారు ఈ విషయమై తరచూ మాట్లాడుతున్నారు. వాళ్లు తమ సమస్యలేంటో స్పష్టంగా తెలుసుకుని మాట్లాడాల్సిన అవసరం ఉందనుకుంటున్నా. వాళ్లు ఏ టోర్నీ ఆడినా బాయ్, సాయ్, కేంద్ర ప్రభుత్వం సాయపడ్డాయి. మేం కూడా విదేశీ కోచ్ లతో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. గత రెండేళ్లుగా వారు ఎలాంటి మద్దతు కోరినా అందించాం. ఇక, టాప్ పథకంలో చోటు గురించి చెప్పాల్సి వస్తే, ఆ పథకానికి క్రీడాకారులను ఎంపిక చేసేందుకు ప్రత్యేకమైన కమిటీ ఉంది. ఆ కమిటీలో వేరే వ్యక్తులు సభ్యులుగా ఉన్నారు. ఆ కమిటీతో నాకు సంబంధంలేదు" అని వివరించారు.

  • Loading...

More Telugu News