: జమాత్ ఉద్ దవాకు లష్కరే తోయిబాతో సంబంధం లేదు... నిషేధించలేం: పాక్
పాకిస్థాన్ మరోసారి తన నైజాన్ని చాటుకుంది. భారత్ లో అస్థిరత సృష్టించేందుకు తీవ్రంగా యత్నిస్తున్న ఉగ్రవాద మూకలపై చర్యలు తీసుకునేందుకు ససేమిరా అంటోంది. ముంబయి పేలుళ్ల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్ ఉద్ దవా సంస్థపై నిషేధం విధించలేమని స్పష్టం చేసింది. జమాత్... కు లష్కరే తోయిబాతో సంబంధం ఉందనడానికి ఆధారాలేవీ లేవని పేర్కొంది. మంత్రి ఖాదిర్ బలోచ్ మాట్లాడుతూ... లష్కరే తోయిబా పేరు మార్చుకుని జమాత్ ఉద్ దవాగా తెరపైకి వచ్చిందని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానంలో పేర్కొన్నారని, అయితే, ఆ విషయాన్ని నిరూపించే ఆధారాలేవీ పాక్ కు చూపలేకపోయారని తెలిపారు. జమాత్ ఉద్ దవా ఓ ధార్మిక సంస్థ అని, టెర్రరిజంతో దానిని ముడిపెట్టలేమని అన్నారు. దేశంలో ఆసుపత్రులు, హెల్త్ క్లినిక్కులు, పాఠశాలలు, మతపరమైన సంస్థలు, అంబులెన్సు సర్వీసులు నిర్వహిస్తోందని ఆయన వివరించారు.