: మోదీపై సోషల్ మీడియాలో విసుర్లు ఇవే!


సోషల్ మీడియాపై ప్రధాని మోదీ ప్రత్యర్ధులకు అందనంత ఎత్తున ఉన్నారన్నది జగమెరిగిన సత్యం. నిత్యం ఏదో ఒక ట్వీట్ తో అలరించే మోదీని కూడా నెటిజన్లు విసుర్లతో విమర్శిస్తున్నారు. తాజాగా బీజేపీ నేతలు, ప్రభుత్వాలపై వివాదాలు రేగుతున్నా, ప్రధాని స్థాయిలో వాటిపై స్పందించకపోవడంతో నెటిజన్లు నిరాశ చెందినట్టున్నారు. దీంతో ఆయనపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. 'మన్ కీ బాత్ నహీ, మౌన్ కీ బాత్ క్యా హై బోలో' అంటూ కొంత మంది ప్రశ్నిస్తే, మోదీని సోషల్ మీడియాలో ఫాలో కావడం వల్ల వివిధ దేశాల జాతీయ దినోత్సవాలు, వివిధ దేశాల, రాష్ట్రాల రాజకీయ నాయకుల జన్మదినోత్సవాలు తెలుసుకోగలగడం తప్ప మరే ఉపయోగమూ లేదని మరికొందరు వ్యాఖ్యానించారు. ఇంకొందరు మోదీ ట్వీట్లను రెండు రకాలుగా విభజించవచ్చని, అవి ఏంటంటే...ఒకటి. మనకు తెలిసిన విషయాలు, రెండు మనం తెలుసుకోవాల్సిన అవసరం లేని విషయాలు అంటూ విమర్శించారు. మధ్య తరగతి ఓట్ల ద్వారా గెలిచిన మోదీ, మధ్యతరగతి సమస్యలను పట్టించుకోవడం మానేశారని ఇంకొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు. మన్ కీ బాత్ ద్వారా ఇతర వర్గాలకు గాలమేస్తున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మోదీని ట్విట్టర్లో విమర్శించే బదులు నేరుగా ఆయనకే లేఖ రాయొచ్చుకదా? ఓ నెటిజన్ సలహా ఇస్తే, అపుడు మోదీ కొన్ని గులాబీపూలు, ఓ సెల్ఫీ పంపిస్తారని మరో నెటిజన్ ఎద్దేవా చేశాడు. విమర్శలు ఎన్ని వచ్చినా కోటీ 35 లక్షలకు పైగా ఫాలోవర్లతో మోదీ టాప్ పొలిటీషియన్ గా కొనసాగడం విశేషం.

  • Loading...

More Telugu News