: చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుబట్టిన అచ్చెన్నాయుడు... కలకలం రేపుతున్న ఫైలు!


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడంటే ఏపీ కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి ఎనలేని గౌరవం. మొన్న తన జన్మదినం సందర్భంగా చంద్రబాబు ఆశీర్వాదం కోసం వచ్చిన అచ్చెన్న, బాబుకు పాదాభివందనం చేశారు. తన సోదరుడు ఎర్రన్నాయుడుతో సమానంగా బాబును గౌరవిస్తానని ఈ సందర్భంగా అచ్చెన్న ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు తీసుకున్న ఓ నిర్ణయాన్ని అచ్చెన్న తప్పుబట్టారు. అంతేకాదు, ఆ నిర్ణయాన్ని అమలు చేయలేనని తేల్చిచెప్పేశారు. దీనిపై ప్రస్తుతం ఏపీ అధికారవర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. వివరాల్లోకెళితే... రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాదులోని నేషనల్ అకాడెమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (న్యాక్) తరహాలో ఏపీలోనూ భవన నిర్మాణ కార్మికుల శిక్షణ కోసం ఓ కేంద్రాన్ని నిర్మించాలని సీఎం హోదాలో చంద్రబాబు నిర్ణయించారు. సదరు కేంద్రం భవన నిర్మాణం కోసం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి రూ.15 కోట్లు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిధి నిర్వహణ కార్మిక శాఖ పరిధి కిందకు వస్తుంది. దీంతో సదరు ఫైలు నేరుగా కార్మిక శాఖ వద్దకు వచ్చింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన కార్మిక శాఖ అధికారులు, నిధుల విడుదల కుదరదని నోట్ రాశారు. తన వద్దకు వచ్చిన ఆ ఫైలును పరిశీలించిన అచ్చెన్న కూడా తన శాఖ అధికారుల నిర్ణయంతో ఏకీభవించారు. నిధుల విడుదల కుదరదని పేర్కొనడమే కాక, ఆ నిధులను రోడ్లు, భవనాల శాఖ పద్దు నుంచి తీసుకోవాలని సూచిస్తూ నోట్ రాశారు. దీంతో ఈ విషయాన్ని సంబంధిత అధికారులు నేరుగా చీఫ్ సెక్రటరీకి నివేదించారు. సీఎం ప్రతిపాదనను బలపరిచిన చీఫ్ సెక్రటరీ కార్మిక శాఖ నుంచే సదరు నిధులు విడుదల చేయవచ్చంటూ పేర్కొన్నారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు కూడా చీఫ్ సెక్రటరీ వాదనను సమర్ధిస్తూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి సదరు నిధులు విడుదల చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. మరి చంద్రబాబు నిర్ణయం అమలువుతుందా? లేక అచ్చెన్న నిర్ణయం నెగ్గుతుందా? అన్న చర్చకు తెరలేచింది.

  • Loading...

More Telugu News