: ఐటీలో కొత్త నీరు... పాత ఉద్యోగాలు పోతున్నాయ్!


సుమారు 150 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3 లక్షల కోట్లు)కు విస్తరించిన భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీలో, తమ ఉద్యోగాలు పోతాయన్న భయం మిడ్ లెవల్ ఉద్యోగుల్లో నెలకొంది. ఒకప్పుడు ఉన్నత స్థితికి నిచ్చనలేసే రంగంగా భావించిన ఐటీ విభాగంలో నేడు ఆటోమేషన్ రాజ్యమేలుతోంది. ఒక్కో సంస్థ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ, యాంత్రీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీనికితోడు విద్యా ప్రమాణాలు మెరుగుపడడంతో, నైపుణ్యమున్న యువత సంఖ్య పెరుగుతోంది. వీరంతా ఐటీ ఉద్యోగాలు పొందేందుకు పోటీ పడుతుండడంతో, ఇండస్ట్రీలోని మిడిల్ లెవల్ ఎంప్లాయిలు ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ తాజా నివేదిక వెల్లడించింది. భారత ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిన సంస్థలుగా ఉన్న యాక్సెంచర్, కాగ్నిజంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తదితర సంస్థలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ, యాంత్రీకరణ విషయంలో పెద్దఎత్తున చర్యలు చేపడుతున్నాయి. గత ఐదేళ్లలో ఐటీ రంగం అందించిన నికర ఉద్యోగుల సంఖ్య పెద్దగా పెరిగిన దాఖలాలు లేవు. మెక్ కిన్సే లెక్కల ప్రకారం ఐటీ ఇండస్ట్రీ 100 బిలియన్ డాలర్లకు ఎదిగే క్రమంలో 30 లక్షల ఉద్యోగాలు రాగా, తదుపరి 100 బిలియన్ డాలర్లను దాటేసరికి కేవలం 10 లక్షల ఉద్యోగాలు మాత్రమే రానున్నాయి. కాగా, ఐటీ కంపెనీల్లో 8 నుంచి 15 సంవత్సరాల అనుభవమున్న ఉద్యోగాల్లో కోత పడనున్నట్టు తెలుస్తోంది. అంతకుమించిన అనుభవజ్ఞులను విధుల్లో ఉంచి, మిగతావారిని కింది స్థాయి ఉద్యోగులుగా తీసుకోవడం వల్ల నైపుణ్యం కలిగిన వారికి ఉపాధినిచ్చినట్టు ఉంటుందని, ఆటోమేషన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుందని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News