: ముఖ్యమంత్రులిద్దరిపైనా బాధ్యతలున్నాయి... అవి గుర్తించండి: పవన్ కల్యాణ్
రాష్ట్రం రెండుగా ముక్కలైపోయిన నేపథ్యంలో, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద చాలా బాధ్యతలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తరువాత కూడా రాజకీయ ఎత్తుగడలతో గేమ్ లు ఆడాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై చాలా బాధ్యతలున్నాయి, ఎన్నో సమస్యలు పరిష్కారం కాలేదు, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారాన్ని పక్కనపెట్టి, పార్టీల అవసరాలే లక్ష్యంగా ముఖ్యమంత్రులు పనిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాల సరిహద్దుల్లో విద్యార్థులకు పాస్ లు లేవంటున్నారు, బస్సుల్లోకి ఎక్కించుకోమంటున్నారు... దీంతో, విద్యార్థులు చాలా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 'ఇదేనా పరిపాలన అంటే?' అని ఆయన నేతలను నిలదీశారు.