: రేవంత్ వ్యవహారం తెలియనిదా?... తలసాని సరే, ప్రజల సంగతేంటి?: పవన్ కల్యాణ్
తనకు రాజకీయాలు కొత్త అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సమాజం, దేశం పట్ల ఆందోళన ఉందని అన్నారు. రాష్ట్రం దేశం ఏమైపోతాయనే ఆందోళన పట్టి పీడిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలతో ఇవి మాట్లాడితే ఆందోళనలు రేగుతాయి తప్ప, ఫలితం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యవహారం న్యాయస్థానంలో ఉందని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో జరిగిన ప్రతి విషయం ప్రజలకు తెలుసని అన్నారు. రేవంత్ రెడ్డి ఎందుకు అలా చేయాల్సి వచ్చింది. టీడీపీలో గెలిచిన నేతలు ఎందుకు పార్టీ మారారు? ఏ స్వలాభం లేకుండానే మారారా? అని అడిగారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి పార్టీలో లోపాలున్నాయని ఆయన తెలిపారు. రాజకీయాల్లో నీతి నిజాయతీలతో ఎవరూ లేరని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాల్లో ఉన్న పార్టీలతోనే సర్దుకుపోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారితే కేసీఆర్ గారు టీఆర్ఎస్ లో చేర్చుకుని మంత్రిపదవిచ్చి గౌరవమిచ్చారు. మరి ప్రజల మనోభావాల సంగతేంటి? వారి అభిప్రాయాలకు విలువ లేదా? అన్నారు. సనత్ నగర్ ప్రజలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనే ఓట్లేసి గెలిపించారని ఆయన స్పష్టం చేశారు. దానిని నేతలు గుర్తించాలని ఆయన సూచించారు.