: ‘గుట్ట’ ప్రసాదం కోసం పోలీసుల వీరంగం...కౌంటర్ ను ధ్వంసం చేసి లడ్డూల లూటీ!


యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రసాదం కోసం పోలీసులు ఎగబడ్డారు. అంతేకాదు, స్వామి వారి ప్రసాదాన్ని దక్కించుకునే క్రమంలో ఒకరినొకరు తోసుకున్నారు. అంతటితోనూ ఆగని పోలీసులు, ఏకంగా ప్రసాదం పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కౌంటర్ ను ధ్వంసం చేశారు. ఆపై స్వామివారి లడ్డూలను డబ్బులివ్వకుండానే లూటీ చేశారు. వివరాల్లోకెళితే... నిన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గుట్ట పర్యటన సందర్భంగా అక్కడ పెద్ద ఎత్తున బలగాలతో భారీ భద్రత ఏర్పాటైంది. దాదాపు గంటన్నరపాటు గుట్టలో గడిపిన ప్రణబ్ అక్కడి నుంచి వెళ్లిపోగానే, పోలీసులంతా ఒక్కసారిగా ప్రసాదం కౌంటర్ వద్దకు చేరారు. కొంతమంది డబ్బులు చెల్లించి ప్రసాదం టికెట్లు కొనుగోలు చేసినా, మరికొంతమంది ఉచితంగానే ప్రసాదం ఇవ్వాలని ఆలయ సిబ్బందిని కోరారు. టికెట్లు లేకుండా ప్రసాదం ఇవ్వడం కుదరదన్న ఆలయ సిబ్బందితో పోలీసులు వాగ్వాదానికి దిగారు. ప్రసాదం కౌంటర్ పై విరుచుకుపడ్డారు. పోలీసుల దాడిలో కౌంటర్ కు ఏర్పాటు చేసిన అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత 8 ట్రేల (ఒక్కో ట్రేలో 24 లడ్డూలు) ప్రసాదాన్ని పోలీసులు తీసుకెళ్లారు. దీనిపై ఆలయ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే వారు అసలు పట్టించుకోనేలేదట. అంతేకాక పగిలిన అద్దాల స్థానంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేయించిన ఉన్నతాధికారులు, లూటీ అయిన లడ్డూలకు సంబంధించి సొమ్మును సిబ్బందితోనే జమ చేయించారట.

  • Loading...

More Telugu News