: నెక్లెస్ రోడ్ లో జోరుగా బైక్ రేసులు... 300 బైకులను సీజ్ చేసిన పోలీసులు
హైదరాబాదు నగరాన్ని బైక్ రేసులు వదిలేలా లేవు. నిన్నటిదాకా నగరానికి అల్లంత దూరంలో ఔటర్ రింగ్ రోడ్డుపై వేడుకలా సాగిపోయిన ఈ బైక్ రేసులు తాజాగా నగరం నడిబొడ్డుకు చేరాయి. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత పెద్ద సంఖ్యలో నెక్లెస్ రోడ్ కు చేరిన యువకులు బైక్ రేసింగ్ లతో హల్ చల్ చేశారు. ఈ సమయంలో అటుగా వెళ్లిన నగరవాసులు బైకుల శబ్దాలకు జడిసిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు బైక్ రేసింగ్ లపై మూకుమ్మడిగా దాడులు చేశారు. పోలీసులను చూసి యువత పరారు కాగా, దాదాపు 300లకు పైగా బైక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే పట్టుబడ్డ యువకులందరూ ప్రముఖుల పిల్లలు కావడంతో పోలీసులు ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు.