: ఇలా ఇబ్బంది పెడితే భూమా రైజ్ అవుతారు తప్ప, వెనుకడుగు వేయరు: భూమా అఖిల ప్రియ
భూమా నాగిరెడ్డినే ఇబ్బంది పెడుతున్నాం, మిగిలిన వారు మాకొక లెక్కా? అనే సందేశాన్ని ప్రజల్లోకి పంపేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నం చేస్తోందని, ఇలాంటి ప్రయత్నాలు చేస్తే తన తండ్రి రైజ్ అవుతారు తప్ప వెనకడుగువేసే ప్రశ్నేలేదని ఆయన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, పోలింగ్ పరిసరాల్లోంచి మహిళా ఎమ్మెల్యేను వెళ్లిపొమ్మని ఎలా అడుగుతారని తన తండ్రి ప్రశ్నించారు తప్ప, ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. సండ్ర వీరయ్యపై కేసు ఉన్నప్పటికీ ఆయనను రాజమండ్రి ఆసుపత్రికి పంపిన టీడీపీ నేతలు, తన తండ్రి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్న వ్యక్తి, షుగరు, బీపీ ఉన్నాయని చెప్పినా నిమ్స్ కు తరలించలేదని ఆమె మండిపడ్డారు. తన తండ్రి జైల్లో నిరాహార దీక్ష చేపట్టారని, ఆయనకు ఏదైనా జరిగితే బాధ్యత ప్రభుత్వానిదేనని ఆమె స్పష్టం చేశారు. తాను ఓటేయడానికి వెళ్లినప్పుడు అడ్డుకున్న పోలీసులు, ఓటేశాక వెళ్లిపోమని ఇబ్బంది పెట్టారని, దానిని ప్రశ్నిస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై శాసనసభలో సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెడతామని ఆమె తెలిపారు.