: భద్రాచలంలో ఆంధ్రా టూరిస్టుల అవస్థలు
ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన టూరిస్టులు ఈ ఉదయం ఖమ్మం జిల్లా భద్రాచలం ఆర్టీఏ కార్యాలయం వద్ద ధర్మాకు దిగారు. తాము దైవదర్శనానికి వస్తే అవస్థల పాలు చేస్తున్నారని విమర్శించారు. వివరాల్లోకి వెళితే, చిత్తూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి భద్రాచలం శ్రీరామచంద్రుని దర్శనం కోసం నిన్న సాయంత్రం ఓ టూరిస్టు బస్సు వచ్చింది. డ్రైవరు వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అవసరమైన పర్మిట్ లేదన్న కారణంగా బస్సును తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తమపట్నం వద్ద ఆపుకున్నారు. ఆపై అక్కడి నుంచి ఆటోలో స్వామి దర్శనానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి బస్సును భద్రాచలం మోటార్ ఇన్ స్పెక్టర్ సీజ్ చేశారని తెలుసుకుని విస్తుపోయి, ఆపై ధర్మాకు దిగారు. ఆ దారిలో వస్తున్న ఇన్ స్పెక్టర్ బస్సును చూసి, ఎందుకాపారో తెలుసుకుని సీజ్ చేసినట్టు తెలుస్తోంది. ఏపీ సరిహద్దులకు అవతల ఉన్న బస్సును ఎలా సీజ్ చేస్తారని, తామెలా వెనక్కు వెళ్లాలని భక్తులు ప్రశ్నిస్తున్నారు.