: వేర్పాటువాదులు, మిలిటెంట్లకు డబ్బులిచ్చాం: 'రా' మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
నిన్న కాందహార్ హైజాక్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన 'రా' (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) మాజీ చీఫ్ ఏఎస్ దులాత్ మరో బాంబు పేల్చారు. భారత్ లోని నిఘా వర్గాలు జమ్మూకాశ్మీర్ లోని వేర్పాటు వాదులకు, మిలిటెంట్లకు డబ్బులిచ్చినట్టు ఆయన తెలిపారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. "ఒక వ్యక్తిని చంపడం కన్నా వారికి డబ్బిచ్చి మనసు మారేలా చేయడం నిజాయతీతో కూడుకున్నది" అని ఆయన అన్నారు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ఉన్న సయ్యద్ సలావుద్దీన్ తనతో సంబంధాలు నడిపాడని, ఇచ్చిన డబ్బుతో పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చి ఇక్కడే గడపాలన్నది ఆయన అభిమతమని తెలిపారు. వాజ్ పేయి ప్రభుత్వం పాలన సాగించిన సమయంలో విమాన ప్రయాణ ఖర్చులు, వైద్య చికిత్సలు, ఇతర ఖర్చుల నిమిత్తం ఎంతో మందికి డబ్బిచ్చామని అన్నారు. రాజకీయ నాయకులు, పార్టీలకు నిధులిచ్చినట్టే మిలిటెంట్లకూ డబ్బు అందేదని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.