: అది కేసీఆర్ భాషే... అర్థం కావాలనే రేవంత్ అలా మాట్లాడారు: టీ-టీడీపీ
కేసీఆర్ కుట్రకు బలై నెల రోజుల పాటు జైల్లో ఉండిన రేవంత్ రెడ్డి, కడుపు మండి మాట్లాడిన నాలుగు మాటలు తప్పయ్యాయా? అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. గతంలో తెలంగాణకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇచ్చిన సమయంలో వ్యతిరేకించి వెళ్లిపోయిన తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాసయాదవ్ లకు ఇప్పుడు తెలంగాణ గుర్తొచ్చిందా? అని తెలుగు మహిళ అధ్యక్షురాలు బి.శోభారాణి ఎద్దేవా చేశారు. రేవంత్ జైలు నుంచి వచ్చిన తరువాత ర్యాలీ జరిగిందే తప్ప నిర్వహించలేదని ఆమె అన్నారు. ఆయనకు అభిమానులు గండ్రగొడ్డలి, ఖడ్గం బొమ్మలను బహూకరిస్తే మారణాయుధాలు ప్రదర్శించాడని కేసు పెట్టారని తెదేపా అధికార ప్రతినిధి ఒంటేరు ప్రతాప్ రెడ్డి విరుచుకుపడ్డారు. పలు బహిరంగ సభల్లో కేసీఆర్ తదితర ఎంతో మంది నేతలు కత్తులు, బాణాలు, గదలు పట్టారని, అప్పుడు కేసులెందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రేవంత్ ఒక్క రోజు మాట్లాడిన భాష గురించి లబోదిబోమంటున్న టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ తిట్ల పురాణం గురించి తెలియదా? అని అడిగారు. కేసీఆర్ కు అర్థం కావాలన్న ఉద్దేశంతోనే రేవంత్ అతని భాషలోనే మాట్లాడాడని మరో నేత నన్నూరి నర్సిరెడ్డి వ్యాఖ్యానించారు.