: మీడియాకు షాకిచ్చిన కేసీఆర్
నిన్న టీడీపీ నేత రేవంత్ రెడ్డి జైలు నుంచి విడుదలవుతూ తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేసీఆర్ తీవ్రంగా స్పందిస్తారని మీడియా ఊహించింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారని సమాచారం సంపాదకులకు వెళ్లింది. దీంతో రేవంత్ వ్యాఖ్యలపై కేసీఆర్ ఏం మాట్లాడుతారో చూడాలనే ఆసక్తితో అంతా మీడియా సమావేశం కోసం ఉత్కంఠతో ఎదురు చూశారు. ఈ క్రమంలో మీడియా సమావేశం ఏర్పాటైంది. సీఎం కేసీఆర్ రంజాన్ వేడుకలపై మీడియాతో మాట్లాడారు. జైలు నుంచి నిన్న విడుదలైన టీడీపీ నేత రేవంత్ రెడ్డి, సీఎం, మంత్రులపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీ స్పందన ఏంటి? అని ఓ జర్నలిస్టు ప్రశ్నించారు, దానికి కేసీఆర్ సమాధానమిస్తూ, 'హే ఊకో... అవి పిచ్చిమాటలు' అంటూ మైక్ కట్ చేసి సమావేశం ముగించారు. దీంతో రేవంత్ వ్యాఖ్యలపై కేసీఆర్ ఘాటుగా స్పందిస్తారని ఊహించిన మీడియా అవాక్కైంది.