: అప్పుతీర్చలేక భార్యను కుదువపెట్టాడు...ప్రాణాపాయ స్థితిలో మహిళ


అప్పుతీర్చలేక సత్యహరిశ్చంద్రుడు భార్యను అమ్మినట్టు, అప్పుతీర్చలేకపోయిన ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను సొంత అన్నకు తాకట్టు పెట్టాడు. వారి కామదాహానికి బలైన ఆమె ప్రాణాపాయస్థితికి చేరుకుంది. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఈ దుర్ఘటన హర్యానాలోని భివాండీ జిల్లాలో చోటుచేసుకుంది. భివాండీ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన సంజయ్ తన అన్న విజయ్ దగ్గర 25 వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. అప్పుతీర్చాలని తీవ్రమైన ఒత్తిడి చేయడంతో తన భార్యను విజయ్ కు సంజయ్ కుదువపెట్టాడు. దీనిని అవకాశంగా తీసుకున్న విజయ్, అతని స్నేహితుడు హర్కీష్ ఆమెపై లైంగిక దాడికి యత్నించారు. వారి ప్రయత్నాన్ని పసిగట్టిన ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమె నోట్లో గుడ్డలు కుక్కి, మంచానికి కట్టేసి, మత్తు మందులు ఇచ్చి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. నెల రోజులు నరకం అనుభవించిన ఆమె పుట్టింటికి సమాచారం అందించింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను విడిపించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగు చూసింది. ఈ ఘోరం జరిగినప్పుడు ఆమె ఇద్దరు పిల్లలు పుట్టింట్లో ఉండడం విశేషం. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన ఆమెను ఢిల్లీలోని తులరామ్ ఆసుపత్రిలో చేర్చారు. తీవ్రమైన షాక్ కు గురైన ఆమె మాట్లాడుతూ స్పృహ కోల్పోతోందని, మానసికంగా, శారీరకంగా విషమ పరిస్థితుల్లో ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా, నిందితులిద్దరూ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News